త్వరలో రానున్న సిద్ధిపేట, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ మాయ మాటలు చెబుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సీఎం సిద్ధిపేట జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేగా వేదిక మీదకు తనను పిలవకుండా ప్రొటోకాల్ పాటించలేదన్నారు. దీనిపై శాసనసభ కార్యదర్శి, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.
నాలుగేళ్ల క్రితం వరంగల్ ప్రజలకు చెప్పిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏమైందో చెప్పాలని… 2033వరకు హైదరాబాద్ కు 150కి.మీ పరిధిలో ఎక్కడా కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించకూడదన్న కండిషన్ సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారన్నారు.
సిద్ధిపేటకు, గజ్వేల్ ను నిధులు ఇస్తున్నారని… మరీ దుబ్బాక ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. సిద్ధిపేటకు ఇచ్చిన నిధులు దుబ్బాకకు కూడా ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేశారు. కొడుకు కోసం ఐటీ పార్క్, అల్లుడి కోసం మెడికల్ కాలేజ్ .. మనవడు కోసం గజ్వేల్‌ను సీఎం అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటకు విమానాశ్రయం తెస్తే స్వాగతిస్తామని… దుబ్బాక పాత బస్టాండ్ సంగతి కూడా పట్టించుకోవాలన్నారు.