స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ జానకిపురం సర్పంచ్ నవ్య మీడియాకెక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియాలో బాగా ప్రచారం కావడంతో ఇదేం పాడు పని అంటూ ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇక బీఆర్ఎస్ అధిష్టానం కూడా రాజయ్య పై సీరియస్ అయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్య దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆదివారం సర్పంచ్ ఇంటికి అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన సర్పంచ్ తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. అనంతరం సర్పంచ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. తన సమస్య గురించి చర్చించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
తాను మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్క విషయం నిజమేనని ఎమ్మెల్యే సాక్షిగా తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల విషయంలో మహిళలు ఎవరూ కూడా వెనకడుగు వేయవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురవుతున్నవారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటున్నాని తెలిపారు ఆమె.
ఇక ఎమ్మెల్యే రాజయ్య కూడా అధిష్టానం నిర్ణయం మేరకు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టుగా తెలిపారు. ఇది ఇలా ఉంటే నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.