రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే
ప్రభుత్వాన్ని నడిపేది టీఆర్ఎస్ అయినప్పటికీ స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతుల్లో ఉంది. హిందువుల పండుగలు జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాలు రాష్ట్రంలో పూర్తిగా అంతం చేయాలని ఎంఐఎం కల కంటోంది. ఆ కలను నిజం చేయాలనే కుట్రలో భాగమే నిమజ్జనాలను అడ్డుకోవడం. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని అందులో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే కాకుండా.. మిగతా నియోజకవర్గాల అభివృద్ధిపైనా కేసీఆర్ దృష్టి పెట్టాలి.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యేల వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయడం.. ఉప ఎన్నికలకు పని చేయడం.. కేసీఆర్ కు వివరాలు అందించడంలో బిజీ అయ్యారు. సీఎంకు గులాంగిరి చేస్తే పదోన్నతులు వస్తాయి అనే ఫీలింగ్ లో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు క్రైమ్ రేట్ పెరుగుతున్నా… ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సరిగ్గా స్పందించడం లేదు.
హైదరాబాద్ లో అర్ధరాత్రి రోడ్లపై కొందరు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ కూడా సరిగ్గా చేయడం లేదు. లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా గాలికొదిలేశారు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అతనిది హత్యా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.