గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ కేసును ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు హైకోర్టులో రాజాసింగ్ భార్య పిటిషన్ వేశారు. రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారని, దాన్ని ఎత్తి వేసి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య పిటిషన్ లో కోరారు.
ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం మంగళ్ హాట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులను జారీ చేసింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది.
ఫిబ్రవరి 19న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. దీని ఆధారంగా రాజాసింగ్ పై గత నెల 25న పోలీసులు పీడీ యాక్ట్ ను పెట్టారు. అదే రోజున ఆయన్ని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2004 నుంచి ఇప్పటివరకు మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. వాటిలో 18 కమ్యూనల్ కేసులేనని తెలిపారు.