ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ బుల్లెట్ బండిపై ఆయన అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు గత కొద్ది రోజులుగా మొరాయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
అయితే రెండ్రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ టైర్ ఊడిపోయింది. రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా ధూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీసు ముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది.
స్పీడ్ తక్కువగా ఉండడంతో ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పటికే ఎన్నో సార్లు రాజాసింగ్ వెహికిల్ నడిరోడ్డుపై ఆగిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ మార్చాలని గత కొంత కాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజాసింగ్ వాపోయారు.
తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా అనేకసార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డుపై ఆగిపోవడంతో రాజాసింగ్ వేరే వాహనాల్లో వెళ్లేవారు. అయితే తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండీషన్ సరిగ్గా లేదని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. హోంమంత్రి, సీఎం కేసీఆర్ కు సిగ్గు శరం లేదంటూ రాజాసింగ్ మండిపడ్డారు.
ఒక వేళ సాధారణ వేగంతో వెళ్లి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇస్తుందని.. అవసరం ఉన్న తనకు మాత్రం సరైన వాహనాన్ని అందించడం లేదని గత నెలలోనూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తనకు కొత్త వాహనం కేటాయించడం లేదని.. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టుగా చెప్పారు. కాగా ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం ప్రగతి భవన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడ కారు వదిలేసి వెళ్లడంతో పోలీసులు దానిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.