తెలంగాణ ఉద్యమంలో పాటతో ఉద్యమాన్ని ఊర్రూతలూగించిన గాయకుడు రసమయి బాలకిషన్. టీఆర్ఎస్ పార్టీ నుండి మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న రసమయి… అప్పుడప్పుడు తన అసంతృప్తిని భయటపెడుతూనే ఉన్నాడు. తాజాగా రసమయి కీలక వ్యాఖ్యలు చేశాడు.
లిమిటెడ్ కంపెనీలో ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని… సొంత నిర్ణయాలుండవన్నారు. కలం, గళం మౌనంగా ఉండటం క్యాన్సర్ కన్నా ప్రమాదం అని… పాటలన్నీ ఇప్పుడు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయన్నారు. పండుగలు, పబ్బాలన్నీ వాళ్ల నెత్తిమీదకు పోతున్నాయని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే అయ్యాక చాలా మంది తనకు దూరం అయ్యారన్నారు.
రమసయి వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించినవేనని, టీఆర్ఎస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని చెప్పకనే చెప్పినట్లు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడొచ్చే పాటలన్నీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, కేసీఆర్ ను పొగుడుతూనే వస్తున్నాయని… దాన్నే ఆయన పరోక్షంగా వ్యక్తపర్చారని, ఒకరంగా అధినేతపై ఇది ధిక్కారస్వరంగా భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.