టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం గరంగరంగా మారింది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ కార్యకర్తలు ఊరికి ఇద్దరో, ముగ్గురో మాత్రమే ఉన్నారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని శంకర్ నాయక్ అన్నారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్‌కు భారీ సంఖ్యలో సభ్యత్వాలు ఉన్నాయన్న ఆయన.. తాము తలుచుకుంటే అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు. మానుకోట రాళ్లకు మళ్లీ పనిచెప్పొద్దన్నారు. బీజేపీ కార్యకర్తలు కంట్రోల్‌లో ఉండాలని.. ఇది రిక్వెస్ట్ మాత్రమేనన్నారు. తాను హెచ్చరిస్తే వేరేలా ఉంటుందన్న ఎమ్మెల్యే.. తన స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుగా అంటూ మాట్లాడారు.