కోయపోచ గూడెంలో ఆదివాసీ మహిళలను అటవీశాఖ అధికారులు చిత్ర హింసలకు గురి చేశారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పచ్చి బాలింతను కూడా వదలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 మంది మహిళలను అన్యాయంగా జైల్లో పెట్టారని విరుచుకుపడ్డారు. ఆదివాసీలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.
తలకు గుడ్డలు కట్టుకొని చేలల్లో పనులు చేసుకునే మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు తలకు బాషికాలు కట్టుకోలేదా..? ఇప్పుడు తలకు గుడ్డలు కట్టుకున్నారు అంటూ నానా బూతులు తిట్టారని ఆరోపించారు. ఆదివాసిలంటే ఎందుకు ఇంత చిన్న చూపుచూస్తున్నారని నిలదీశారు.
పొలం పనులు చేసుకుంటున్న సునిత అనే మహిళను అధికారులు కాలుతో తన్నారని సీతక్క ఆరోపించారు. ప్రజలపై ఆదిపత్యాన్ని చెలాయించే అధికారులను ఎదురు తిరిగి బడిత పట్టి తరిమి కొట్టాలని ప్రజలకు సూచించారు. అటవీ శాఖ మంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన రేంజ్ ఆఫీసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టి నిందితులను శిక్షించాలన్నారు. ఆదివాసీలపై రోజుకో రకమైన కేసులు పెట్టి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 18 పసిపాప తల్లిపై కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. తల్లికోసం ఆ పసికందు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయిందన్నారు. ఆదివాసీలపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతక్క.