బీఆర్ఎస్ పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. తనపై లైంగిక ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పారు. పార్టీ పెద్దల ఒత్తిడితో ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ ఇంటికెళ్లారు. సర్పంచ్ దంపతులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మానసిక క్షోభకు గురిచేసుంటే క్షమించాలని, తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలని,జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను..నేను తప్పు చేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలని.. అందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించిందని.. రాజయ్య మీడియా సాక్షిగా సర్పంచ్ నవ్యకు క్షమాపణలు చెప్పారు.
ఇక తనకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని.. తాను మహిళల ఆత్మగౌరవం కోసమే పనిచేస్తున్నానని అన్నారు రాజయ్య. ప్రాణం ఉన్నంత వరకు మహిళలకు సహకారం అందిస్తానన్న ఆయన కొన్ని కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ప్రవీణ్ ను చూసే సర్పంచ్ టికెట్ ఇచ్చాను కాని.. నవ్యను చూసి కాదన్న ఎమ్మెల్యే రాజయ్య.. జానకీపురం అబివృద్దికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానన్నారు. పార్టీ అధిష్టానం కూడా జానకీపురంను అభివృద్ధి చేయాలని ఆదేశించిందని చెప్పారు.
మరో వైపు సర్పంచ్ నవ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తా, ఆయన వల్లే నేను సర్పంచ్ అయ్యా, నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా,పార్టీని ఒక కుటుంబంలా భావిస్తా, జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నా, తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తా.. అని అన్నారు.