గుంటూరు: రాజధానిలోని ఒక గ్రామంలో జరిగిన వినాయకచవితి ఉత్సవాల్లో తెలుగుదేశం నాయకులు కులం పేరు వాడి అసభ్య పదజాలంతో తనను దూషించారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరంలో జరిగిన చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడికి వెళ్లారు. ఆమె ఉత్సవాల్లో పాల్గొనటంపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ – వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపు చేయడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనను తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు తీవ్రంగా వ్యాఖ్యలు చేసి లోపలికి రానీయకుండా అడ్డుకున్నట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. ‘నువ్వు ఈ ఉత్సవాల్లో పాల్గొంటే వినాయకుడు మైలు పడతాడు’ అంటూ తనపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మహిళా ఎమ్మెల్యే వాపోయారు.