ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీ శ్రేణులు రెండు వర్గాలు విడిపోయారు. అందులో గన్నవరం నియోజకవర్గం ముందువరసలో ఉంది. అధికార పార్టీలో ఇంటిపోరు రోజు రోజుకీ ముదురుతోంది.
టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరడాన్ని ముందునుండే వ్యతిరేకిస్తూ వస్తున్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు.. తమ అసమ్మతిని బాహటంగానే వెళ్లగక్కుతున్నారు. వంశీతో కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను టార్గెట్ చేస్తూ.. తాజాగా విమర్శలు గుప్పించారు దుట్టా, యార్లగడ్డ.
ఈ నేపథ్యంలో యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వల్లభనేని వంశీ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జస్టిస్ చౌదరిలుగా దారినపోయే ప్రతివాడు కామెంట్స్ చేస్తుంటారని వ్యంగ్యంగా అన్నారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారని.. విమర్శించుకునే వాళ్లకి ఏమైనా ఇబ్బంది ఉంటే అధిష్ఠానికి చెప్పుకోవాలని సూచించారు. సీఎం జగన్ సూచనల మేరకే తాను పని చేస్తున్నానని పునరుద్ఘాటించారు.
తాను చేస్తున్న కార్యక్రమాలతో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే సీఎం జగన్ ను కలవాలని సూచించారు వంశీ. అంతేకానీ.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏం చేయాలో తనకు తెలుసని పేర్కొన్నారు. ‘‘పనిచేయకుండా హడావుడి చేసే వాళ్లను చాలా మందిని చూశాను. నేను హీరోనా.. విలన్ నా గన్నవరం ప్రజలను అడిగితే చెప్తారు. నేను విలన్ అని అన్నవారేమైనా మహేష్ బాబు, ప్రభాస్ లా..?’’ అంటూ తన మండిపడ్డారు వంశీ.