కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధికారిక కార్యక్రమాల్లో ఆధిపత్యపోరు ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది.
బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎమ్మెల్యేను వంశీని స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఆయన్ను వెనక్కి వెళ్లాలంటూ నిలిపివేశారు. స్థానికులతో కలిసి వైసీపీలో మరో వర్గం నేతలు కూడా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. చివరికి పోలీసుల బందోబస్తు మధ్య వంశీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ ఆయన రాకకు ముందే గన్నవరం వైసీపీలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు మధ్య కొంత విబేధాలుండేవి. వంశీ వచ్చిన తర్వాత గన్నవరం వైసీపీ మూడు ముక్కలైనట్టుంది. ఈ వివాదం జగన్ వరకు వెళ్లగా.. ఆయన స్వయంగా యార్లగడ్డ, వంశీల చేతులు కలిపి.. కలిసి పని చేసుకోవాలని సూచించారు. కానీ వర్గపోరు మాత్రం అలాగే కొనసాగుతోంది.