టీడీపీ అధినేత చంద్రబాబుకి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరం టూర్ లో చంద్రబాబు చేసిన కామెంట్లపై అదే స్థాయిలో ఎటాక్ కు దిగారు. దేశంలో ఎవరైనా.. ఎక్కడైనా తిరగొచ్చన్న వంశీ.. చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అస్సాం వెళ్లొచ్చన్నారు.
నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి కూడా ఎగరొచ్చు. కావాలంటే గోదావరిలోకి కూడా దూకొచ్చు అంటూ ఎద్దేవా చేశారు. తన హయాంలో ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగలు రాష్ట్రంలో తిరగకుండా చంద్రబాబు నియంత్రించలేదా? మరి దానిని ఏమంటారని నిలదీశారు.
ఉద్రిక్త పరిస్థితులు ఉండబట్టే చంద్రబాబు గన్నవరం వెళ్లకుండా పోలీసులు నియంత్రించారని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూసి చంద్రబాబు కూడా అవే డైలాగులు చెబుతున్నాడంటూ సెటైర్లు వేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాలంటూ నారా లోకేష్ ఆహ్వానించడంపై స్పందించిన వల్లభనేని.. తెలుగుదేశం పార్టీని పెట్టింది స్వర్గీయ నందమూరి తారకరామారావు అని తెలిపారు. అసలు నువ్వు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి అంటూ లోకేష్ ని నిలదీశారు వల్లభనేని వంశీ.