ఇప్పటికే అదానీ అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. సమావేశాలు సజావుగా సాగడం లేదు. దీనిపై కేంద్రం, ఆర్బీఐ వివరణ ఇచ్చినా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. అయితే.. తెలంగాణ అసెంబ్లీలోనూ అదానీ అంశం చర్చకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసెంబ్లీలో దీనిపై మాట్లాడారు.
ఐటీ దాడులపై మాట్లాడిన ఎమ్మెల్యే.. అదానీ ఇష్యూపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవేనని అన్నారు. దేశంలో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ అభివృద్ధి జరగడం లేదన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం అదానీ లాంటి వాళ్లకు లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు వివేకానంద గౌడ్. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు రాష్ట్ర ప్రగతికి అద్దం పడుతున్నాయని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది.
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్లు ఢమాల్ అన్నాయి. రోజురోజుకీ సంపద ఆవిరైపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.