నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అచ్చంపేట నియోజకవర్గంలోఎంపీ రాములు, అతని కుమారుడు భరత్ ప్రసాద్ కు సంబంధించి బ్యానర్లు తొలగించాలంటూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు రాములును హెచ్చరించిన ఆడియో ఒకటి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కాబోయే ఎంపీ, కాబోయే ఎమ్మెల్యే అంటూ నియోజక వర్గంలో పలు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. భరత్ కు సంబంధించి అలాంటి బ్యానర్లు కనిపించవద్దని, లేదంటే పార్టీ కన్నా ముందు తనకున్న అధికారాలను వినియోగిస్తానని బాలరాజు చెప్పారు. ఇక ఈ వ్యవహారాన్ని పార్టీ దగ్గరే తేల్చుకుంటానని రాములు దానికి బదులివ్వడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.
ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. చాలా కాలంగా గువ్వల బాలరాజు, ఎంపీ రాములు వర్గాలకు మధ్య అచ్చంపేట నియోజక వర్గంలో విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గతంలో జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక పార్టీలో భేదాభిప్రాయాలకు దారి తీసింది. ఛైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ కల్వకుర్తి జడ్పీటీసీ, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్ తన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి గానూ.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి, వారిని ఎదగనివ్వకుండా అడ్డుకునేందుకు సొంత పార్టీలో వ్యక్తులే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే , ఎంపీ మధ్య వార్ మొదలైంది.