ఫాం హౌస్ కేసులో రిట్ అప్పీల్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పు పై ప్రభుత్వ రిట్ అప్పీలు దాఖలు చేయడంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. ప్రభుత్వ తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ఇక లంచ్ బ్రేక్ తరువాత రోహిత్ రెడ్డి తరపున గండ్ర మోహన్ వాదనలు కొనసాగించారు. తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరపు లాయర్ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాన్ని రద్దు చేసి సీబీఐకు అప్పగించడం సరికాదన్నారు.
ఇక ప్రతిపాదిత నిందితుల తరపున వాదనలు వినిపించిన సీతారామ్మూర్తి రిట్ అప్పీల్ పిటిషన్ అసలు మెయింటేనబుల్ కాదని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై రిట్ అప్పీల్ కు అవకాశం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రివిజన్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మరో వైపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యంతరాలను న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాతే అవి సీఎం కేసీఆర్ చేతికి వెళ్లాయని కోర్టుకు విన్నవించారు. పైలెట్ రోహిత్ రెడ్డి సాక్ష్యాలు, ఆధారాలను సీఎం కేసీఆర్ కు ఇచ్చి ఉంటారని కోర్టుకు చెప్పారని, అయితే అలా జరగలేదని దవే న్యాయమూర్తికి వివరించారు.