ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకె రవి శంకర్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ కొండగట్టు వద్ద ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. వారి వెంట జడ్పీటీసీ రామ్మోహన్ రావు, కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత రాజ నర్సింగరావు, సర్పంచులు తిరుపతి, సుదర్శన్ తదితరులు ఉన్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి పరిచేందుకు గాను సీఎం కేసీఆర్ ఇటీవల రూ.100 కోట్లను మంజూరు చేశారు. తెలంగాణలో పురాతన ఆలయంలో ఒకటైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
వాస్తవానికి మంగళవారమే ముఖ్యమంత్రి కొండగట్టుకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున సీఎం పర్యటనను బుధవారానికి వాయిదా వేశారు.
కాగా సీఎం పర్యటన సందర్భంగా ఇప్పటికే అధికార, పోలీసు యంత్రాంగం పలుమార్లు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ దాదాపు మూడు గంటలపాటు ఆలయంలో ఉండి పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆలయ అభివృద్ధిపై అధికారులకు తగు దిశానిర్దేశం చేయనున్నారు.