ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో దాఖలైన అన్ని పిటిషన్లపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో రేపు మరోసారి వాదనలను వినిపించనున్నారు.
ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లన్నింటిపై సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఇప్పటికే నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో సిట్ తరఫున సీనియర్ న్యాయవాది దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని దవే వాదించారు. ఫామ్ హౌస్‌లో ముగ్గురు నిందితులు అడ్డంగా దొరికిపోయారని ఆయన అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని ముగ్గురు నిందితులు అనుకున్నారని ఆయన వాదించారు.
సిట్ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయని ఆయన చెప్పారు. మరోవైపు ఈ కేసులో న్యాయవాది శ్రీనివాస్ కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో నలుగురిపై దాఖలైన మెమోలను నాం పల్లి ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. ఇక ఈ కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది.
బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ పోలీసులు దాఖలు చేసిన మెమోను నాం పల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నలుగురిని నిందితులుగా చేరుస్తూ గత నెల 22న నాంపల్లి ఏసీబీ శాఖ ప్రత్యేక కోర్టులో మొయినాబాద్ పోలీసులు మెమో దాఖలు చేశారు.
ఈ కేసులో ఎలాంటి డబ్బు పట్టుబడలేదని పేర్కొంది. నిందితులు ఎన్నికల్లో ఎలాంటి నేరాలకు పాల్పడలేదని కోర్టు పేర్కొంది. అందువల్ల 171బీ,171ఈ సెక్షన్లు వర్తించవని వెల్లడించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఏ4 నుంచి ఏ7 వరకు నిందితుల పాత్రపై ఎఫ్ఐఆర్, ఏ1 నుంచి ఏ3 నిందితులతో కలిసి ఏ4 నుంచి ఏ7 వరకు నిందితులు కుట్రలు చేసినట్టు ఎఫ్ఐఆర్ వెల్లడించలేకపోయిందని చెప్పింది.
అక్టోబర్ 27, 29 తేదీల్లో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులల్లో కూడా ఏ4 నుంచి ఏ7 వరకు నిందితుల పేర్లను ఎక్కడా చేర్చలేదని వెల్లడించింది. ఇక ఏ1 నిందితుడు బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను కలిసి ఫోటో దిగినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఒక వ్యక్తితో కేవలం ఫోటో దిగినంత మాత్రాన నేరం చేసినట్టు కాదని చెప్పింది.
పీసీ యాక్ట్ కు సంబంధించిన నేరాలను విచారించేందుకు శాంతి భద్రతల పోలీసులు కానీ లేదా సిట్ కు ఈ విషయంలో విచారణ జరిపేందుకు అర్హత లేదని పేర్కొంది. అవినీతి నిరోధక శాఖ లాంటి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ ఈ నేరాన్ని విచారించాల్సివుంటదని చెప్పింది. ఈ క్రమంలో మెమోను కొట్టివేసింది.