బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐలను జేబు సంస్థలుగా వాడుకుంటున్న కేంద్రం వాటితో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు.
సీబీఐ ఎంక్వైరీకి ఓకే చెప్పడమంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరపరచడమేనని అన్నారు. దుర్మార్గమైన పాలన నడిపిస్తున్న కేంద్రంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికి తెలుసన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే సహించేదిలేదని హెచ్చరించారు. దోపిడీ, స్వార్ధం లేని పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధ్యం కాలేదని అన్నారు. మానవీయ కోణం, సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.