గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో జగన్ కీలుబొమ్మలా మారుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కేసీఆర్‌తో కలిసి ఇవ్వటమేంటని ప్రశ్నించారు. టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా ? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఎంత మితృత్వం ఉన్నా ఏపీ హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఏపీ భూ భాగంలోనే జరగాలన్నారు. వైకుంఠ బ్యారేజీ నిర్మాణం ద్వారా ఇది సాధ్యమని చెప్పారు. అలా చేయకుండా దుమ్ముగూడం నుంచి నాగార్జునసాగర్‌కు వయా నల్గొండ మీదుగా తీసుకురావడం రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. గోదావరి నీటి విషయంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కావేరీ గొడవల తరహాలో భవిష్యత్తులో ఇక్కడా గొడవలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం సబ్సిడీకి ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సులు కొనకుండా టెండరు పిలవడమేంటని నిలదీశారు.