బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నిరాశ, నిస్పృహ ,అసూయ, అసహనం ఆవరించాయని ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది తానే అన్న విషయాన్ని ఈటల మరచి పోయారని తెలిపారు. పైగా కేసీఆర్ రొమ్ము గుద్దారంటూ మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ ఎవరి రొమ్ము గుద్దారు? అని ఆయన ప్రశ్నించారు. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పులు చేయలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన అప్పులు ఉత్పాదక రంగం కోసమేనన్నారు. తెలంగాణ చేసిన అప్పులకు లెక్క ఉందన్నారు. కేంద్రం అప్పులు తెచ్చి ఏమి చేసిందని అడిగారు.
రాష్ట్రంలో క్యాపిటల్ వ్యయం ఎక్కువగా ఉందన్నారు. ఆ విషయం ఈటలకు తెలియదా? అని అన్నారు. ఆదానీ తీరుతో దేశ సంపద ఆవిరి అవుతున్న విషయం ఈటలకు తెలియదా? అని ప్రశ్నలు గుప్పించారు. ఈటల వామపక్ష భావజాలం వదిలి బీజేపీలో చేరారన్నారు. ఇపుడు నీతులు చెబుతున్నారా అని ఆయన మండిపడ్డారు.
ఈటలకు కేంద్ర బడ్జెట్ ఏ కోణం లో నచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణకు మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్‌ను ఈటల ఏ మొహం పెట్టుకొని సమర్ధించుకుంటారని ఆయన ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నందుకు కేంద్ర బడ్జెట్ ఈటలకు నచ్చిందా అని ఎద్దేవా చేశారు.
పీఎం కిసాన్ పథకానికి నిధులు తగ్గించినందుకు ఈటెలకు బడ్జెట్ నచ్చిందా అని అడిగారు. విభజన చట్టం హామీల అమలును ప్రస్తావించనందుకు ఈటెలకు కేంద్ర బడ్జెట్ నచ్చిందా చెప్పాలన్నారు. తెలంగాణకు ఒక్క నర్సింగ్ కాలేజీ ఇవ్వనందుకు ఈటలకు బడ్జెట్ నచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీల సంక్షేమం గురించి ఈటల మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోపల ఒకటి బయట ఇంకో విధంగా ఈటల వ్యవహరిస్తారన్నారు. కేంద్రంలో మోడీకి చెప్పి ఓబీసీ మంత్రిత్వ శాఖను ఈటల ఎందుకు పెట్టించడం లేదన్నారు. బీసీల మీద ప్రేముంటే బీసీ గణన కోసం ఈటల ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు.
ఈటల హాయంలో హుజురాబాద్ లో భవనాల నిర్మాణం పూర్తయి ఉండవచ్చన్నారు. అప్పటి ప్రభుత్వం ఎవరిది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని అన్నారు. రాచరికం తెలంగాణలో లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందన్నారు.