ఎన్నికల హామీలను నెరవేర్చడంలో జగన్ విఫలమైయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తే 3వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించి కేవలం 250రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారని ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం జగన్ కు వారసత్వంగా వచ్చిన లక్షణమని, హామీలను నెరవేర్చడం వాళ్ళ వంశంలో లేదని దుమ్మెత్తిపోశారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో 900హామీలను ఇచ్చి మ్యానిఫెస్టోలో 9హామీలను పేర్కొనడం విశ్వసనీయత అనిపించుకుంటుందా అని ప్రశ్నించారు. 15 వేలు రైతు భరోసా అని 7,500 ఇస్తూ రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు. 15 లక్షల మంది కౌలు రైతులకు భరోసా అని పట్టుమని 50 వేల మందికి ఇవ్వకపోవడం గురించేనా మీరా చెప్పేది సాయి గారు? అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై మండిపడ్డారు. సగం పూర్తి అయినా అమరావతిని రాజధానిగా సరైంది కాదని చెప్పడం ఎలాంటి వారసత్వం అని ప్రశ్నిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన పలు ప్రశ్నలను సంధించారు.