తెలంగాణలో హోరాహోరీగా మారిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 4 గంటల కల్లా అందరి నోళ్లకు తాళలుపడనున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలే కాదు.. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీనిస్తున్నారు.దీనికి తోడు ఖమ్మం, హైదరాబాద్ రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ ఈసారి ఓటర్లు సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పట్టభద్రులు జైకొట్టేదెవరికన్నది ఆసక్తికరంగా మారింది.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోరం పరాభవం చవిచూసిన టీఆర్‌ఎస్.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తాము బలం కోల్పోలేదని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకే ప్రచారం కోసం భారీగా పార్టీ నేతలను బరిలోకి దింపింది. హైదరాబాద్ ఇన్‌చార్జిగా మంత్రి గంగుల కమలాకర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి హరీశ్‌రావు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంచార్జీలుగా ప్రచారం సాగించారు. ఖమ్మం, నల్గొండ, వరంగ్‌కు సంబంధించిన స్థానిక మంత్రులే ఆ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇతర పార్టీలు కూడా ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఆరు జిల్లాల్లో తమ నేతలతో ప్రచారాన్ని సాగించాయి.
కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి నేతలు విస్తృతంగా పర్యటించి.. ప్రచారం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థులు రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అర్వింద్ వంటి నేతలు నియోజకవర్గాలను చుట్టేశారు. ఇక టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోసం ఆ పార్టీ నేతలే గాక అనేక ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ప్రచారం సాగించడం విశేషంగా మారింది. మొత్తానికి ఈ హోరాహోరీ ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది.