తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. మహబూబ్‌నగర్- హైదరాబాద్-రంగారెడ్డి, వరంగల్- నల్గొండ--ఖమ్మం స్థానాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు వరకు కొనసాగింది. 4 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
మరోవైపు వరంగల్- నల్గొండ--ఖమ్మం స్థానం నుంచి మొత్తం 71 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికార టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రామలు నాయక్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి తరపున కోదండ రామ్, యువ తెలంగాణ పార్టీ తరపున రాణీ రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న మధ్య ఇక్కడ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ స్థానం గతంలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఆ పార్టీ నేత పల్లా రాజేశ్వర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు.
మహబూబ్‌నగర్- హైదరాబాద్-రంగారెడ్డి స్థానం నుంచి మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. టీఆర్ఎస్ తరపున సురభి వాణీదేవి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచందర్‌రావుతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కె. నాగేశ్వర్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు గట్టిగా పోటీనిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ 39.09 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ స్థాన్ గతంలో బీజేపీకి సిట్టింగ్ స్థానం. ఆ పార్టీ నేత రామచందర్ రావు ప్రాతినిధ్యం వహించారు.