రాష్ట్రంలో ఉద్యోగాలు అంగట్లో అమ్మే సరకులుగా మారాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రతి దాంట్లో ఇన్వాల్ అయ్యే కేటీఆర్, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు ఎక్కడున్నారని ఆయన నిలదీశారు. లీకేజీపై వారు ఎందుకు మాట్లాడరని ఆయన వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు మంత్రులంతా మాట్లాడారన్నారు. మరి పేపర్ లీకేజీపై వారంతా ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై కేసీఆర్ మాట్లాడాలన్ానరు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ వాడు కానీ ప్రవీణ్ టీఎస్పీఎస్సీలోకి ఎలా వచ్చాడని ఆయన ప్రశ్నించారు. ఏపీకి చెందిన ప్రవీణ్‌ను సెక్రెటరీ పీఏగా ఎట్లా నియమించారని ఆయన ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది అసెంబ్లీలో చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా భర్తీ చేయలేదన్నారు. టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకూ మొదలుపెట్టలేదన్నారు. దానికోసం పెట్టిన టెట్ పరీక్ష జరిగి 6 నెలలు అవుతోందన్నారు. రాబోయే విద్య సంవత్సరంలోనూ మళ్లీ అరకొర టీచర్లతోనే నెట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు.