గతంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిందని ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని విజయ దశమితో పోయిందన్నారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోవడానికి కేసీఆర్ అసమర్ధతే కారణం అని ఆరోపించారు. పరిపాలనలో చేసిన తప్పిదాలు చర్చకు రావొద్దని దేశం మీద పడ్డారంటూ మండిపడ్డారు.
గతంలో తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గతంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ.. కేంద్ర పార్టీగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం అంతకు ముందే ఉందని, కేసీఆర్ మొదలు పెట్టలేదని జీవన్ రెడ్డి అన్నారు. పంట రుణాలపై వడ్డీ రాయితీని ఎత్తేశారని, రుణ మాఫీ కూడా చేయలేదన్నారు. సబ్సిడీలు ఎత్తివేసి, రైతుబంధు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే విత్తన రాయితీ లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నది జలాల్లో తెలంగాణ వాటా సాధించలేకపోయారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది కేసీఆర్ నిర్లక్ష్యమా? లేదా ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చీకటి ఒప్పందమా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసినప్పుడు సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
పోలవరం ముంపు కారణంతో రాష్ట్రానికి సీలేరు పవర్ ప్రాజెక్ట్ లేకుండా పోయిందన్నారు. అనాడు తుమ్మిడి-హట్టి ప్రాజెక్టు నిర్మించినట్లు అయితే.. ఇవాళ లక్ష కోట్ల కాళేశ్వరం భారం ఉండేది కాదని, మీరు ఉద్యమ నాయకుడే కదా.. అప్పుడు ఏం చేశారు అంటూ నిలదీశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.