ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ను తెలంగాణ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. గురువారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ తెలంగాణ సమస్య కాదన్నారు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదని కోదండరామ్ చెప్పారు. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించిందని దుయ్యబట్టారు.
సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని? కవిత మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా అనడం సిగ్గుచేటు. సొంత వ్యాపారం కోసం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు? కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు కోదండరామ్.
కవిత, అదానీ విషయంలో టీజేఎస్ ఒకే విధానంతో ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలతో సతమతమవుతున్నారని, మిలియన్ మార్చ్ స్ఫూర్తితో శుక్రవారం ‘తెలంగాణ బచావో’ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఈ సదస్సుకు తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు కోదండరామ్.