నరేంద్ర మోడీ దేశ పరిశ్రమలు, సంస్థలను అదానీలకు కట్టబెడుతున్నారని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె ప్రధాని నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు. దేశానికి ప్రధాని మోడీ కాదని.. అదానీ అనే చందంగా దేశ పరిస్థితి తయారైందని విరుచుకుపడ్డారు. మోడీ దేశంలో ఉంటే ఎలక్షన్ మోడ్, విదేశాల్లో ఉంటే ఎరోప్లేన్ మోడ్ తప్ప మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు కవిత.
మోడీ మిత్రుడు కాబట్టే.. అదానికి ఏడు ఎయిర్ పోర్టులు అమ్మారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేసి.. ఉద్యోగులను బీజేపీ ప్రభుత్వం ఆగమాగం చేస్తుందని ఘాటుగా ఆరోపణలు చేసారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలను అమ్మడంతో పాటు.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల హక్కులను హరించే విధంగా చట్టాలు చేస్తోందని కవిత విమర్శించారు.
కార్మికుల హక్కులను కాలరాసే నల్లచట్టాలను రద్దు కోసం కాజీపేట నుంచే ధర్మయుద్ధం మొదలుపెడదామని కవిత పిలుపునిచ్చారు. ప్రజల్ని కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కార్మికుల చెమట చుక్కల విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని స్పష్టం చేశారు. మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలుంటేనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు కవిత.
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇంటింటికీ ఉచితంగా రేషన్ ఇస్తామని చెప్పిన మోడీ.. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ప్రజలకు రేషన్ కూడా కట్ చేసారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కార్మికులు, కర్షకులు, యువకులు, మహిళల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు. ఉద్యోగావకాశాలు కల్పించకుండా యువతను వేధిస్తున్న పార్టీ బీజేపీ అని విరుచుకుపడ్డారు. వరంగల్ లాంటి పట్టణంలో, పేద ప్రజలకు స్థలం ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారని గుర్తు చేశారు. దేశంలో 44 కార్మిక చట్టాలు రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం, నాలుగు నల్లచట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు కవిత.