ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులపై స్టే ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల 16న ఆమె విచారణకు హాజరు కావాల్సి వుంది. కానీ మహిళనైన తనను చట్ట విరుద్దంగా విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని ఆమె ఖండించారు. ఈ క్రమంలో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఈ సందర్బంగా కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… చట్ట విరుద్ధంగా మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలిచారని ఆయన తెలిపారు. ఇతర నిందితులతో కలిపి విచారిస్తామని నోటీసుల్లో చెప్పారన్నారు. కానీ దానికి విరుద్దంగా ఈడీ విచారణ జరిపిందన్నారు. దీంతో పాటు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్సీ కవిత మొబైల్ ఫోన్ సీజ్ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లారు.
రేపు ఆమె ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని ఆయన కోరారు. దీనిపై సుప్రీం కోర్టు మౌనం వహించింది. పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టేందుకు నో చెప్పింది. ఈ నెల 24న దీనిపై వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది.