బీజేపీ జై శ్రీరామ్ అంటే.. టీఆర్ఎస్ జై హనుమాన్ అంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేవుడి కంటే భక్తులు.. నాయకుల కంటే ప్రజలే గొప్ప వాళ్లని అన్నారు.
జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందడమే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధ్యేయంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు కవిత. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల దగ్గర టీఆర్ఎస్ అభివృద్ధిపై చర్చలు జరపాలన్నారు. రాష్ట్రం వచ్చిందే యువకుల కోసమని.. వారికోసం ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని చెప్పారు.
తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి గొప్ప పథకాలతో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని గుర్తు చేశారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీడీ కార్మికులకు రూ.700 పెన్షన్ ఇస్తుంటే.. తెలంగాణలో రూ.2 వేలు అందుతోందని వివరించారు.
ఇక ఎంపీ అరవింద్ పై విరుచుకుపడ్డారు కవిత. అబద్ధానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శలు గుప్పించారు. కేంద్రం చేసిన అభివృద్ధి ఏమీ లేదు కానీ ప్రజల నెత్తిన రేట్ల భారం పెడుతున్నారని మండిపడ్డారు.