ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 9న రావాలంటూ నోటీసులు పంపారని.. కానీ, తాను 11న వస్తానని చెప్పానన్నారు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరన్న ఆమె.. కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరానని తెలిపారు. కానీ, ఈడీ తమ వినతిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తానన్న ఆమె.. తెలంగాణ నేతల్ని వేధించడం దర్యాప్తు సంస్థలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
తమ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అది ఫెయిల్ కావడంతోనే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. మోడీకి తాను భయపడనని.. బీజేపీ కుట్రలను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అదానీ స్కామ్ పై ఇంతవరకు దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించిన కవిత.. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మోడీ, అదానీనే అని విమర్శలు చేశారు.
విపక్ష నేతలపై బీజేపీ యుద్ధం ప్రకటించిందని.. ఈ కుట్రలను రాజకీయంగా ఎదుర్కొంటామని తెలిపారు. ముందుగా కేంద్రం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కాకుండా అధిక ధరలు, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని హితవు పలికారు. తాను ధైర్యంగా ఈడీ విచారణకు వెళ్తున్నానని.. ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు కవిత. విపక్షాలను టార్గెట్ చేయడం సరికాదని.. మోడీ వన్ నేషన్-వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చారని సెటైర్లు వేశారు.
మోడీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందన్న కవిత.. అవినీతి నేతలు బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ వచ్చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తాము ఎవరికీ ‘బీ’ టీమ్ కాదని.. ఎప్పటికీ ‘ఏ’ టీమే అని వ్యాఖ్యానించారు. తనకు కేసీఆర్, కేటీఆర్ తో పాటు పార్టీ మొత్తం అండగా ఉందని తెలిపారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్న కవిత.. మహిళా బిల్లు కోసం ధర్నా ఉందనగానే ఈడీతో నోటీసులు పంపించిందని ఆరోపించారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ను బయట పెట్టాలన్నదే తన ఉద్దేశంగా చెప్పారు. అందుకే, ధర్నా తర్వాతే ఈడీ విచారణకు వెళ్తున్నానని స్పష్టం చేశారు.