అదానీ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉండబోదన్న కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇలాంటి ప్రకటన చేయడం దారుణమన్నారు. అదానీతో పాటు ఎల్ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థల షేర్ల విలువ భారీగా పడిపోయాయని ఆమె అన్నారు. దీంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు.
అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం జేపీసీని నియమించాలని కోరారు. దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారని మండిపడ్డారు.
ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటన్నారని ఆమె ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం మద్ధతుతో అదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో ప్రజలందిరికీ తెలుసన్నారు. అదానీ వ్యవహారంపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందన్నారు.
దేశానికి తెలంగాణ బడ్జెట్ స్పూర్తిదాయకమన్నారు. కేంద్ర బడ్జెట్ నిరుత్సాహకరంగా ఉందన్నారు. ఉందన్నారు. కానీ కేసీఆర్ బడ్జెట్ మాత్రం దేశానికి స్ఫూర్తినిస్తోందన్నారు. రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు.