ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మీట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కవిత అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టిందని ఆరోపించారు.
దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అమ్ముడుపోలేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదని.. ఇకపై పుట్టబోదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బొందపెట్టే వరకూ తన పోరాటం ఆగదన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికే బీఆర్ఎస్ గా మార్చారని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.
కాగా దేశంలో సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత త్వరలోనే అరెస్ట్ అవుతుందంటూ రోజుకో బీజేపీ నేత కామెంట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.