– ప్రగతి భవన్ కు కవిత
– కేసీఆర్ తో భేటీ
– ఢిల్లీ పరిణామాలపై వివరణ
– న్యాయ నిపుణులతో చర్చలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించింది. 9 గంటల పాటు సాగిన ఈ ఎంక్వైరీలో అనేక ప్రశ్నలు వేశారు అధికారులు. విచారణ తర్వాత కాసేపు కేసీఆర్ నివాసంలో ఉన్న కవిత.. తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చేశారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో వరుస భేటీలు అవుతున్నారు కవిత.
శనివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ చేరుకున్న కవిత.. నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఈడీ విచారణపై చర్చించారు. అలాగే, ఆదివారం ఉదయం మంత్రి హరీష్ రావుతో కలిసి కవిత మరోమారు ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈడీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, సమాధానాలు చెప్పిన తీరుపై చర్చించారు. ముఖ్యంగా 16న జరగబోయే విచారణ.. ఏం చేయాలనే దానిపై కేసీఆర్ తో కవిత, హరీష్ చర్చించినట్టు సమాచారం.
ప్రగతి భవన్ లో న్యాయ నిపుణులతో కూడా మంతనాలు జరిపారు. గతంలో సీబీఐ విచారణ, కవితకు ఇచ్చిన నోటీసులు, లిక్కర్ కేసులో సంబంధం ఉన్న పలువురు ఇచ్చిన స్టేట్ మెంట్స్, చార్జిషీట్స్ లో పేర్కొన్న అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. 16న ఈడీ అధికారులు ఏ ప్రశ్నలు సంధిస్తారు, వాటిని ఎలా ఎదుర్కోవాలి.. తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈడీ విచారణ తర్వాత న్యాయ నిపుణులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. దీనిని ఎలా ఎదుర్కొంటారనేది హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కాంలో ఈనెల 6వ తేదీన ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేశారు. తాను గతంలో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకొంటున్నట్టుగా రౌస్ అవెన్యూ కోర్టులో 10వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. పిళ్లై వాంగ్మూలంలో కవిత పేరు ఉందని ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.