ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీంను ఆశ్రయించారని వార్తలొచ్చాయి. ఈడీ విచారణకు సంబంధించి 20న హాజరు కావాలని తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ.. తన పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆమె అభ్యర్థించినట్టు.. దాన్ని కోర్టు తోసిపుచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
అంతేకాదు, ముందుగా తెలియజేసినట్టు ఈనెల 24నే మీ పిటిషన్ పై విచారణ జరుపుతామని సుప్రీం స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదంతా అవాస్తవమని కవిత స్పందించారు. తాను తాజాగా సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ వేయలేదన్నారు. ఇంతకుముందు దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుగుతుందని కవిత ట్విట్టర్ లో తెలియజేశారు.
గురువారం ఢిల్లీలోనే ఉన్న ఆమె.. ఈడీ ఎదుట హాజరు కాలేదు. తన ప్రతినిధితో లేఖ పంపారు. ఈడీ తీరు సరిగ్గా లేదని.. నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగుతోంది అన్నారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగులో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని అన్నారు.
ఈడీ అధికారులకు పంపిన సుదీర్ఘ లేఖలో ఆమె.. తన నిర్ణయానికి పలు కారణాలను ప్రస్తావించారు. కోర్టు పరిశీలనలో ఉన్నందున ఇది సబ్ జ్యుడీస్ అవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెకు మళ్లీ ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 20న విచారణ ఉంటుందని స్పష్టం చేసింది.