బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. ఈ మేరకు ఆమే స్వయంగా ప్రకటన చేశారు. మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ దగ్గర.. ఒక్క రోజు దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ పై ఈ దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును సభలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు కవిత.
మహిళా రిజర్వేషన్ ఇస్తామని గత రెండు ఎన్నికల సందర్భంలో చెప్పిన బీజేపీ ఆ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత కనీసం జనాభా గణన చేయలేదని.. బీసీ గణన చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి హక్కులు వారికి రావాల్సిందే అని స్పష్టం చేశారు.
దేశం కోసం.. దేశ భవిత కోసం.. ఒకరోజు దీక్ష చేస్తున్నట్టు తెలిపారు కవిత. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ తోపాటు రాష్ట్రానికి ఎంపీ సీట్లను పెంచాలని.. ఈ మేరకు ప్రభుత్వం గతంలోనే డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్పందించిన కవిత.. విపక్ష నేతలను దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. అదానీపై ఈడీ, సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని అడిగారు. సుప్రీం ఆదేశాలతోనే దర్యాప్తు మొదలైందని.. మోడీ వైఫల్యాలపై నిలదీస్తే ఏజెన్సీలతో భయపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేన్నీ డైవర్ట్ చేయడానికి తము ఆందోళనలు చేయడం లేదని స్పష్టం చేశారు కవిత.