మహిళలు వంట గదికే పరిమితం కాకూడదని సూచించారు ఎమ్మెల్సీ కవిత. సోమవారం కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పని చేస్తున్నారని తెలిపారు. తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీషు మీడియం చదివించిందని గుర్తు చేశారు. ప్రతీ ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దిందన్నారు కవిత.
ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కొలువులను కేసీఆర్ సర్కార్ ఇచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరంలో రూ.18 వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందించిందన్నారు. పేద కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు కవిత. బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మాయమాటలు చెప్పడం తప్ప చేసి చూపించిందేమీ లేదని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో గోసి గొంగడి వేసుకుని, ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రసమయి అంటూ కొనియాడారు కవిత. ఈ సారి ఎమ్మెల్యేగా రసమయిని 60 వేల ఓట్ల మెజార్టీతో మన మహిళలు గెలిపించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం తన పాటతో అలుపెరుగని పోరాటం చేసిన ఘనత రసమయిది అని ప్రశంసించారు.
గాయకుడు పాలకుడైతే అభివృద్ధి ఎలా ఉంటుందో మానకొండూరు నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతుంది అని కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.