మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పటిది కాదన్నారు. గతంలో పార్లమెంట్‌లోనూ ఈ డిమాండ్ వినిపించామని పేర్కొన్నారు.
ములుగు జిల్లాలో ఈ రోజు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రామప్పలో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ అభివృద్ధి చెందడంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. త్వరలో రామప్ప పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రామప్పకు యూనెస్కో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామప్ప ఆలయంలో ఎక్కువగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదని వెల్లడించారు. ములుగు గిరిజన ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె అన్నారు. కాబట్టే ఆయన ములుగును జిల్లాగా చేశారన్నారు.
ములుగులో గిరిజన యూనివర్సిటీకీ భూమి ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాదో చూడాలని చెప్పారు. ములుగులో వైద్య కళాశాలలో వచ్చే ఏడాది తరగతలు ప్రారంభం అవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో మేడారం జాతరకు నాలుగు సార్లు రూ. 100 కోట్లు ఇచ్చామన్నారు.
తుపాకులగూడెంలో రూ. 1800 కోట్లతో సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో రూ. 137 కోట్లతో కరకట్టలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ వైద్యుడు ఉన్నాడని చెప్పారు. ఇది కేసీఆర్ ఘనత అని ఆమె చెప్పుకొచ్చారు.