కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. గురువారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ముందుగా అనుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయని మరో రోజు వస్తానని కవిత లేఖ రాశారు. దీనిపై ఈడీ స్పందన ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
అయితే.. ఈడీ నుంచి నోటీసులు రాగానే కవిత ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుంటూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కవిత ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేం జరగలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
ఈడీ నోటీసుల విషయంలో ఉదయం న్యాయనిపుణులతో చర్చలు జరిపారు కవిత. ఇదే అంశంపై ముఖ్యమంత్రితో కూడా ఫోన్ లో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కవిత. ప్రగతి భవన్ కు వెళ్లకుండా నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు.
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని.. ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు కవిత. అయితే.. ఈ కార్యక్రమం ముందురోజే ఈడీ విచారణకు పిలిచింది. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని చెబుతూనే.. 15న హాజరవుతానంటూ రిక్వెస్ట్ చేశారు కవిత.