ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా జర్నలిస్టులను టార్గెట్ చేయడం సులభంగా మారిందని పేర్కొన్నారు. దేశంలో ఇటీవల చాలా మందిపై పెగాసస్ ఉపయోగించారన్నారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారంటూ ఆమె తెలిపారు.
హైదరాబాద్‌లో ‘మీడియా స్పియర్’ పేరుతో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ మాస్ కమ్యూనికేషన్ విభాగం మంగళవారం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ… పాకిస్తాన్ వంటి దేశాలలో వార్తలు రాసినందుకు మహిళా జర్నలిస్టులను వారి కుటుంబ సభ్యులే పరువు హత్యలు చేస్తున్నారంటూ చెప్పారు.
జర్నలిజం అనేది మహిళలకు అనుకున్నంత సులభమైన వృత్తి కాదన్నారు. , కానీ చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఈ రంగం అనేకమంది మహిళలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ వృత్తిని స్వార్థంతో కాకుండా సమాజం కోసం చిత్తశుద్ధి, నిబద్ధతతో చేయాలన్నారు. అప్పుడే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.
ప్రపంచంలోని వివిధ రకాల సంస్థలతో మహిళా జర్నలిస్టులు సంబంధాలు కలిగివున్నారన్నారు. మహిళలంతా స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని ఆమె సూచించారు. దేశంలో మహిళలు ఈ దుస్తులే ధరించాలి, ఇలాగే మాట్లాడాలంటూ దుష్టుల చెప్పే మాటలను పట్టించుకోవద్దన్నారు. సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నత స్థానాలను చేరుకోవాలన్నారు.