ఏపీలో రాజకీయం కీలక మలుపు తిరిగింది. జనసేనతో పొత్తులపై బీజేపీ నేత మాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో బీజేపీ, జనసేన మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
ఇరు పార్టీల మధ్య పొత్త వున్నప్పటికీ తమతో జనసేన కలిసి పనిచేయకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సాయం కోరామని, కానీ దానిపై ఆ పార్టీ స్పందించలేదని బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ మాదవ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు కోరామని, కానీ జనసేన నుంచి ఎలాంటి స్పందనా రాలేదని తెలిపారు. ఇక పొత్తుల విషయంలోనూ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయని ఆయన అన్నారు. ఏపీలో సొంతంగా ఎదగాలని బీజేపీ అనుకుంటోందన్నారు. మగళవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు.
అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమలోనే తమ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోందన్నారు. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. అలాంటి పొత్తులేమీ లేవని తేల్చి చెప్పారు.