మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్సీ తాత మధుసూధన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో ఏడు సంవత్సరాలు ఉండి, కలలన్నీ నెరవేర్చుకుని ఇప్పుడు పార్టీకి ద్రోహం చేస్తావా? అంటూ ప్రశ్నించారు.
నోటికి వచ్చినట్లు అవాకులు, చెవాకులు మాట్లాడుతావా? నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ క్రమంలోనే చేరికలు జరిగి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరారని చెప్పారు. పొంగులేటి రూ.300 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు సంపాదించాడని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తాత మధు.
కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బుధవారం వైరాలో జరిగిన కార్యక్రమంలో తాత మధు దుయ్యబట్టారు. పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఎవరి జపం చేశారని మండిపడ్డారు.
నాడు పొగిడిన నోటితోనే ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ పరిపక్వతకు అద్ధం పడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల గురించి గొప్పగా చెప్పకుండా మోడీ, రాహుల్ గురించి మాట్లాడతారా? అంటూ ఫైర్ అయ్యారు.