లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు గాను నాటు నాటుకు అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. అయితే.. అవార్డ్ అందుకున్న వేళ కీరవాణి కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఆస్కార్ ను చేతబట్టుకున్న ఆయన.. ఇంగ్లీష్ లో పాట పాడుతూ పరవశించిపోయారు. డైరెక్టర్ రాజమౌళి, ఆయన కుమారుడు కార్తీకేయ, తన కుటుంబ సభ్యుల సహకారాన్ని పాట ద్వారా చెబుతూ ధన్యవాదాలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్.. తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది.. ఈ మూవీ దేశాన్ని గర్వపడేలా చేసింది అని అన్నారు.
నాటునాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు ప్రకటించిన వెంటనే.. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. నాటునాటు పాట రిచ్ నెస్ కు కారణం రమ అని రాజమౌళి కొనియాడారు. ఈ పాటకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
వరల్డ్ వైడ్ గా 81 పాటలు ఆస్కార్ కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటుతో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్ కు పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది.