ఇటీవల నెల్లూరులో వరుస హత్యలు సంచలనంగా మారుతున్నాయి. మూడు రోజుల క్రితం నెల్లూరు తల్పగిరి కాలనీలో ఓ యువకుడి గొంతుకోసి హత్య చేశారు కొందరు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. శుక్రవారం రాత్రి నెల్లూరు ఉడ్ హౌస్ సంఘం వద్ద మహేష్ అనే యువకుడిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు.
నెల్లూరులోని ఉడ్ హౌస్ సంఘం వద్ద శుక్రవారం రాత్రి మహేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలసి క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు ముసుగులు ధరించి అటువైపు వచ్చారు. నేరుగా మహేష్ వద్దకు వెళ్లి అతడి గొంతు కోసారు. విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. గొంతు తెగడంతోపాటు, శరీర భాగాలపై అయిన కత్తి గాట్లతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆస్పత్రికి తరలించే లోపే మహేష్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు రోజుల వ్యవధిలో నెల్లూరులో జరిగిన మరో దారుణం ఇది. ఆమధ్య హోటల్ యజమానుల జంట హత్యల తర్వాత నెల్లూరులో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు గస్తీ పెంచారు, బందోబస్తు కాస్త స్ట్రిక్ట్ చేశారు. కానీ ఇటీవల మళ్లీ పరిస్థితి మామూలుగా మారింది. నెల్లూరు జిల్లాలో మెల్ల మెల్లగా క్రైమ్ రేట్ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం తల్పగిరి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా దాదాపు అలాగే కత్తిగాట్లకు బలైన యువకుడు ఇప్పుడు ప్రాణాలు వదిలాడు. ఇది తెలిసినవారి పనేనని అనుమానిస్తున్నారు.
మహేష్ అనే యువకుడు ఆ సమయానికి అక్కడికి క్యారమ్ బోర్డ్ ఆడేందుకు వస్తాడని పక్కా సమాచారంతోనే హంతకులు ముసుగులు ధరించి వచ్చి అతడిని హతమార్చినట్టు తెలుస్తోంది. రక్తపు మడుగుల ఉన్న మహేష్ ని ఆస్పత్రికి తరలించే క్రమంలో అతను స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ హత్యతో మరోసారి నెల్లూరు వార్తల్లోకెక్కింది. జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.