ఈజిప్టులో సుమారుగా 4, 5 వేల ఏళ్ల కిందటి పిరమిడ్లు ఎన్నో ఉన్నాయి తెలుసు కదా. అయితే వాటిల్లో ఒక పిరమిడ్ వద్ద ఓ మోడల్ ఫొటోషూట్ చేసింది. దీంతో ఆమె చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెతోపాటు ఆమెను ఫొటోలు, వీడియోలు తీసిన ఫోటోగ్రాఫర్‌ను కూడా అరెస్టు చేశారు. మోడల్ సల్మా అల్-షిమి ఈ నేపథ్యంలో విమర్శలను ఎదుర్కొంటోంది.
ఈజిప్టులోని కైరోకు దక్షిణం వైపు 20 మైళ్ల దూరంలో ఉన్న సక్కారా నెక్రోపోలిస్ అనే ప్రాంతం వద్ద జోసర్ అనే పిరమిడ్ ఉంది. అది సుమారుగా 4700 సంవత్సరాల కాలం నాటిది. అయితే ఈజిప్టు ప్రభుత్వం పిరమిడ్ల వద్ద ఫొటోషూట్‌లు చేయడం, ఫొటోలు దిగడాన్ని నిషేధించింది. కానీ ఈ విషయం మోడల్ సల్మా అల్-షిమికి తెలుసో లేదో కానీ సదరు పిరమిడ్ వద్ద పురాతన ఈజిప్షియన్ల దుస్తులను ధరించి ఆమె ఫొటోషూట్ చేసింది. వీడియోలు కూడా తీసుకుంది. అనంతరం వాటిని తన సోషల్ ఖాతాల్లో ఆమె పోస్ట్ చేసింది.
అయితే ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈజిప్టు పోలీసులు ఆమెను, ఆమెను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌ను అరెస్టు చేశారు. పురాతన ఈజిప్షియన్ల నమ్మకాలు, ఆచార వ్యవహారాలకు భంగం కలిగించడమే కాకుండా, నిషేధ ప్రాంతంలో ఫొటోషూట్ చేసినందుకు వారిపై కేసులు నమోదు చేశారు.
కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. నిజానికి ఆమె ధరించింది పురాతన ఈజిప్షియన్ల దుస్తులే కదా, అందులో అసభ్యత ఏముంది, అసలు ఆ ప్రాంతంలో ఫొటోలు దిగకూడదని నిషేధం ఉందని ఇప్పటి వరకు తెలియదు, నిజంగా అలాంటి రూల్స్ ఉన్నాయా.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కాగా 2018లోనూ సరిగ్గా ఇలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ చియోప్స్ పై ఓ జంట నగ్నంగా ఎక్కుతూ ఫొటోలను తీయించుకున్నారు. అనంతరం ఆ ఫొటోలు వైరల్ అవడంతో ఆ జంటను, ఆ ఫొటోలను తీసిన ఫొటోగ్రాఫర్‌ను, వారిని అక్కడికి తీసుకెళ్లిన ఒంటె యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక మన దేశంలోనూ ఇటీవలే ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఓ జంట హంపిలో ఫొటోషూట్ చేసింది. అక్కడ ఫొటోలు తీయవద్దనే రూల్ ఉన్నప్పటికీ వారిని అక్కడ ఫొటోషూట్ చేసుకునేందుకు ఎవరు అనుమతించారు ? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.