ప్రధాని నరేంద్ర మోడీపై సొంత పార్టీ నేతే ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలకు ఆయన ద్రోహం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇటీవల మోడీ ఉజ్బెకిస్దాన్ లో ఎస్సీఓ సదస్సుకు హాజరై చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ కావడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ సదస్సులో జిన్ పింగ్.. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చూపే కరపత్రాలను పంపిణీ చేశారని, పైగా ‘అధికారిక’ అట్లాస్ లో చైనా భాషలోనే వీటి పేర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ‘ఫైనల్ కిక్ టు ఇండియా.. రష్యా హ్యాజ్ ఎడాప్టెడ్ చైనీస్ నేమ్స్ ఇన్ దెయిర్ మ్యాప్ ‘ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంటే చైనాను పరోక్షంగా రష్యాతో పోల్చారు.
భారత సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని, ఈ కారణంగా అన్ని విధాలుగా వార్ ని ఎదుర్కోవడానికి ఇండియా సంసిద్ధంగా ఉండాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. లడఖ్ లోని తూర్పు ప్రాంతంలో పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రావలసి ఉందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెలారంభంలో తెలిపింది.
ఇక్కడ ‘అత్యవసరమని భావించిన ప్రాంతం నుంచి’ ఉభయ దేశాల బలగాలు వెనక్కి వెళ్లిన కారణంగా మొత్తం మీద పరిస్థితి నిలకడగా ఉందంటూ చైనా దౌత్యాధికారి సన్ వీడాంగ్ ప్రకటన చేశారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరుణ్ బాఘ్చి.. ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇక్కడ పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావాలంటే మరికొన్ని చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
లడఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖవద్ద భారత, చైనా దళాల ఉపసంహరణ జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో చైనా కదలికలకు సంబంధించిన శాటిలైట్ ఇమేజీలు ఈ మధ్యే వెలుగులోకి వచ్చాయి. వెనక్కి వెళ్ళినట్టే వెళ్లి ఆ దేశ దళాలు దొంగచాటుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈస్టర్న్ లడఖ్ లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వం తన నాలుగు డివిజన్లను రొటేట్ చేస్తోంది. జిన్ జియాంగ్ మిలిటరీ డివిజన్ లోని ఈ బలగాల మోహరింపు ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంటోంది. బహుశా దీనివల్లే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి .. ఏకంగా ప్రధాని మోడీపైనే ధ్వజమెత్తారు.