మన పూర్వికులు చెప్పిన సామెతలు అన్నీ వారివారి అనుభవాలను బట్టి పుట్టాయనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అనే సామెత అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద హోదాలో ఉన్నా.. ఏ స్థాయిలో ఉన్నా కన్న తల్లికి అతను చిన్న పిల్లాడే.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్లారు మోడీ. అక్కడ తన తల్లి హీరాబెన్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ మోడీ తన తల్లిని కలిసి ఆశీర్వాదాలు తీసుకునే వారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. తల్లి కన్న పిల్లల మీద చూపించే ప్రేమ తనివితీరనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. భారీ రోడ్ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని మోదీకి అభివాదం చేశారు. జై మోడీ, జై..జై మోడీ అన్న నినాదాలతో రహదారులు మోగిపోయాయి. పెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ దారి పొడవునా ప్రజలకు, కార్యకర్తలకు చేతులు ఊపుతూ మోడీ అభివాదం తెలిపారు.