రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ అన్ని కుట్రలు చేస్తుందని..కేసీఆర్ మాత్రం తెలంగాణలో ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలన్నా లక్ష్యంతోనే బీఆర్ఎస్ పార్టీని పెట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పేద ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో గులాబీ జెండా వచ్చింది కాబట్టే కేసీఆర్ ఇన్ని పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. 2014 ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయడానికే సీఎం తాపత్రయపడుతున్నారని చెప్పారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో నీళ్ల కోసం కొట్టుకుంటున్నారని తెలిపారు.
గుజరాత్ లో ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాలలు లేవని.. మోడీ మొత్తం ప్రైవేట్ పరం చేసి పేదల నడ్డి విడిచారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రైతులు కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవడంతో మోడీకి వణుకు వస్తుందన్నారు. తెలంగాణలో అభివృద్థి పనులను అడ్డుకోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
ఇప్పటికే రాష్ట్రానికి రావల్సిన 17 వేల కోట్లు ఆపేశారని దుయ్యబట్టారు. తెలంగాణకు అప్పులు ఇవ్వకుండా బ్యాంకులను మోడీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తీసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.