ఈ ఏడాది ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ దేశాభివృద్ధికి సహకరిస్తోందని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశాలు దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషిస్తాయని అన్నారు.
కరోనా సమయంలో సాధించిన విజయాలు, వ్యాక్సినేషన్ లో చేరిన మైలురాళ్లు.. వీటన్నింటి గురించి చర్చించి ప్రపంచానికి భారత్ సత్తా తెలిసేలా ఈ సమావేశాలు జరుగుతాయని ఆశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలో మరిన్ని అవకాశాలు అందుకోవడానకి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చలు ఫలప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.
అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు. ఎన్నికల ప్రభావం ఈ సమావేశాలపై, చర్చలపై ఉంటుందనేది నిజమేనమని ప్రధాని తెలిపారు. మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. కానీ బడ్జెట్ అనేది ఏడాది మొత్తానికి మార్గనిర్దేశం అందిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.