ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ సామాన్యుల బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని మోడీ ప్రశంసించారు. పేదవారికి పక్కా ఇల్లు, కొళాయి నీరు, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి చేయాలనే తపన నిర్మలా సీతారామన్ లో కనిపించిందని కొనియాడారు. వీటితో పాటు గ్రామాల్లో కూడా ఆధునిక ఇంటర్నట్ కనెక్టివిటీపై ప్రత్యేకశ్రద్ధ చూపించారని చెప్పారు.
స్నేహపూర్వకమైన, ప్రగతిశీలమైన బడ్జెట్ అని అన్నారు. పెట్టుబడులకు, అభివృద్ధికి ఊతం ఇచ్చేలా ఉందని మోడీ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతూ కొత్త ఉద్యోగాల సృష్టికి ఈ బడ్జెట్ పునాదులు వేస్తుందని అభిప్రాయపడ్డారు.
వందేళ్లలో వచ్చిన భయానక విపత్తు కరోనా సమయంలో అభివృద్ధి పట్ల నూతన ఆత్మవిశ్వాసాన్ని ఈ బడ్జెట్ పెంచుతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఈ బడ్జెట్ సామాన్యులకు అనేక నూతన అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. కిసాన్ డ్రోన్లు, వందే భారత్ రైళ్లు, డిజిటల్ కరెన్సీకి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని చెప్పారు.
Advertisements
వ్యవసాయ అంకురాల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధిని కేటాయించామని అన్నారు. పర్వతమాల స్కీమ్ మన దేశంలో మొదటిసారి అమలవుతోందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం వల్ల పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థ నిర్మితమవుతోందని చెప్పారు.